2019లో ఆ ఇద్ద‌రికి టిక్కెట్లు డిసైడ్ చేసిన జ‌గ‌న్‌..

19424
0

2019 ఎన్నిక‌ల్లో గెలుపు కోసం వైకాపా అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టి నుంచే ర‌క‌ర‌కాల ప్లాన్లు, ఎత్తులు, పై ఎత్తుల‌తో దూసుకుపోతున్నారు. ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌క‌పోతే పొలిటిక‌ల్‌గా ఫ్యూచ‌ర్ లేద‌ని డిసైడ్ అయిన జ‌గ‌న్ అందుకోసం ఇత‌ర పార్టీల్లో సీనియ‌ర్ల‌ను, పేరున్న నాయ‌కుల‌ను వీలున్నంత వ‌ర‌కు త‌న పార్టీలోకి తీసేసుకుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే ఏపీలో కీల‌క‌మైన కృష్ణా, గుంటూరు జిల్లాల‌పై కాన్‌సంట్రేష‌న్ చేసిన జ‌గ‌న్ ఈ రెండు జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, కాస్త పేరున్న వారిని త‌న వంచ‌న చేర్చుకుంటున్నారు. ఇప్ప‌టికే కృష్ణా జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస్ పార్టీలో చేర‌గా, ఇదే క్ర‌మంలో మ‌రో ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేలు మ‌ల్లాది విష్ణు, య‌లమంచిలి ర‌వి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ఇక గుంటూరు జిల్లా నుంచి పేరున్న కాసు ఫ్యామిలీకి చెందిన మాజీ మంత్రి కాసు వెంక‌ట‌కృష్ణారెడ్డి కుమారుడు కాసు మ‌హేష్‌రెడ్డి వైకాపాలో చేరిపోయారు. ఇదే జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే మ‌క్కెన మ‌ల్లిఖార్జున రావు పేరు సైతం వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే కాసు మ‌హేష్‌రెడ్డి పార్టీలో చేరిన బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లాలో ఇద్ద‌రికి టిక్కెట్లు క‌న్‌ఫార్మ్ చేసేశారు.

కాసు మ‌హేష్‌రెడ్డి పార్టీలో చేర‌డంతో ఆయ‌న న‌ర‌సారావుపేట నుంచి పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై స్పందించిన జ‌గ‌న్ న‌ర‌సారావుపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి, కాసు మ‌హేష్‌రెడ్డి గుర‌జాల నుంచి పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించారు. దీంతో జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల్లో అఫీష‌యల్‌గా వీరిద్ద‌రికి తొలిసారిగా టిక్కెట్లు ఎనౌన్స్ చేసిన‌ట్ల‌య్యింది.

SHARE