కెప్టెన్సీ భారం కాదు..

238
0

16 టెస్టులు.. 9 విజయాలు.. 2 ఓటములు.. 5 డ్రాలు.. కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి ప్రస్థానమిది. భారత్‌కు మూడు సిరీస్‌ విజయాలు అందించడమే కాదు.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌గానూ నిలబెట్టాడు విరాట్‌. ఇంకా విదేశాల్లో నిరూపించుకోవాల్సి ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి కెప్టెన్‌గా కోహ్లి ప్రయాణం గొప్పగానే సాగుతోంది. న్యూజిలాండ్‌పై సిరీస్‌ విజయం, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం ఒకేసారి అందిన నేపథ్యంలో ఎంతో సంతోషంగా, ఉద్వేగంగా ఉన్న విరాట్‌.. బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ అనేక అంశాలపై మనసు విప్పాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..

ఈ వయసుకి టెస్టు కెప్టెన్‌ అవుతానని.. అందులోనూ నెంబర్‌వన్‌ జట్టుకి నాయకత్వం వహిస్తానని అస్సలు వూహించలేదు. ఐతే కెప్టెన్‌గా జట్టులో నా పాత్ర చాలా చిన్నది. జట్టు యాజమాన్యం పాత్ర చాలా ఉంటుంది. ఫ్లెచర్‌ బృందం.. ఆ తర్వాత రవిశాస్త్రి, బంగర్‌, శ్రీధర్‌.. వీళ్లందరూ కలిసి నన్ను జట్టుకు నాయకత్వం వహించేలా సన్నద్ధం చేశారు. వీళ్లందరికీ నేను రుణపడి ఉంటాను. ధోని నాయకత్వంలో ఆడేటపుడు నేను నా బ్యాటింగ్‌ ప్రణాళికల గురించే ఆలోచించేవాడిని. మిగతా బ్యాట్స్‌మెన్‌, బౌలర్లతో మాట్లాడేవాడిని కానీ నిర్ణయాలేమీ తీసుకునేవాడిని కాదు. ఇదే అన్నిటికంటే పెద్ద విషయం. నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి. ఈ విషయంలో ధోని నుంచి చాలా నేర్చుకున్నా. నిర్ణయం సరైందో కాదో.. మనకు మనం సర్దిచెప్పుకుని ముందుకెళ్లడం కెప్టెన్‌గా అత్యంత కీలకమైన విషయం. కెప్టెన్‌ అయ్యాక కొన్ని తప్పులు చేసినప్పటికీ వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతున్నా. నా ఎదుగుదలను లెక్కల్లో చెప్పలేను కానీ.. కాలంతో పాటు ఓ క్రికెటర్‌గా ఎదుగుతున్నా.

ప్రతికూలంగా చూడను: కెప్టెన్సీ అనగానే భారం లాగా భావించను. ప్రతికూలంగా చూడను. దీని వల్ల నాపై అదనపు ఒత్తిడేమీ లేదు. జట్టు కోసం మరింత బాధ్యత తీసుకోవడాన్ని ఇష్టపడతా. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. బాధ్యత మరింత పెరగడం వల్ల నా బ్యాటింగ్‌ ఇంకా మెరుగవుతుంది తప్ప దెబ్బ తినదు. జట్టు ఎదుర్కొనే ఒత్తిడిని ముందుండి నేను తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధం. మా జట్టుపై అనవసరంగా ఎవరు విమర్శలు చేసినా.. ప్రతికూల ప్రభావం పడేట్లున్నా దాన్ని నేను ముందు ఎదుర్కొంటా. కెప్టెన్‌గా అది నా కర్తవ్యం. కెప్టెన్‌గా నా ప్రయాణం విజయవంతంగా సాగుతుందని ఆశిస్తున్నా.

10 మందీ సరే అన్నారు: కెప్టెన్‌గా నా తొలి టెస్టు అనుభవం ఇంకా గుర్తుంది. 2014 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అడిలైడ్‌ టెస్టులో నాకు బాధ్యతలు ఇచ్చారు. ఆ మ్యాచ్‌ సందర్భంగా సహచరులతో దూకుడుగా ఆడటం గురించి మాట్లాడా. నాలుగో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్నపుడే.. లక్ష్యం ఎంతైనా సరే, ఛేదించడానికే ప్రయత్నిద్దామని అన్నాను. ఈ క్రమంలో ఏం జరిగినా పర్వాలేదని చెప్పాను. నా అభిప్రాయంతో ఏకీభవిస్తారా అని అడగా.. పది మందీ సరే అన్నారు. ఈ మ్యాచ్‌ ఓడినప్పటికీ.. సహచరులు చూపించిన నమ్మకం, ధైర్యం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఈ జట్టు సాహసాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. నాకప్పుడే అర్థమైంది.
కుంబ్లేతో చర్చలేం లేవు: కుంబ్లే ఎంత గొప్ప ఆటగాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మా ఇద్దరి ఆలోచనలు చాలా త్వరగా కలిసిపోయాయి.

కుంబ్లే కోచ్‌ కావడానికి ముందే ఒకసారి విమాన ప్రయాణంలో సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. అప్పుడే మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తామని అర్థమైంది. అందుకే కోచ్‌ అయ్యాక మా ఇద్దరి మధ్య పెద్ద చర్చలేమీ జరగలేదు. జట్టును ముందుకు తీసుకెళ్లడానికి నేనేం కోరుకుంటున్నానో అనిల్‌ భాయ్‌కి అర్థమైంది. కుంబ్లే వచ్చాక జట్టులో చాలా మార్పు వచ్చింది. అదనపు భరోసా వచ్చింది. ముఖ్యంగా బౌలర్లలో నమ్మకం పెరిగింది. కుంబ్లే అనుభవం అమూల్యం. అన్ని రకాల పరిస్థితులనూ ఎదుర్కొన్నవాడు కావడంతో మా పని తేలికవుతోంది.
వీళ్లు మామూలోళ్లు కాదు: మేం ప్రపంచ స్థాయి జట్టుగా పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో కష్టపడుతున్నాం. టెస్టు క్రికెట్‌ విసిరే సవాళ్లు ఇంకే ఫార్మాట్లోనూ ఉండవు. ఈ ఫార్మాట్లో ఆడాలంటే ఎంతో కృషి ఉండాలి. సన్నద్ధత చాలా ముఖ్యం. ప్రస్తుత జట్టుకు ఈ లక్షణాలున్నాయి. ఈ జట్టులోని ఆటగాళ్లు తమ కెరీర్లో ముగిసేసరికి అత్యుత్తమ ఆటగాళ్లుగా పేరు తెచ్చుకుంటారు. దిగ్గజాల సరసన నిలుస్తారు. కనీసం ఐదారుగురు ఆటగాళ్ల గురించి అలా చెప్పగలను. తర్వాతి తరానికి వాళ్లు గొప్ప ప్రమాణాల్ని నిర్దేశిస్తారు. ప్రస్తుత జట్టులో అంత సామర్థ్యముంది. ఈ జట్టుకు సారథ్యం వహించడాన్నే నేను పెద్ద ఘనతగా భావిస్తున్నా. ఐతే గొప్ప ఆటగాళ్లుగా పేరు తెచ్చుకోవాలంటే గొప్ప గొప్ప ప్రదర్శనలు చేయాలి. ప్రస్తుతం ఆ లక్ష్యంతోనే సాగుతున్నాం.

SHARE